శ్రీవిద్య 2006లో క్యాన్సర్‌తో మరణించే ముందు నటి శ్రీవిద్య ఓ మలయాళ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు

By charan-admin Apr3,2024

జీవితంలో ఒకానొక సమయంలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడూ ఇష్టపూర్వకంగానో, అయిష్టంగానో కొన్ని బంధాల్లోకి తోయబడతారు. అది పెళ్లి కావచ్చు, సహజీవనం కావచ్చు. మరేదైనా కావచ్చు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఓ వ్యక్తి నన్ను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆయనొక నటుడు. ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు! మా పెళ్లి దాదాపు ఖరారైంది. ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళ్తున్నారు. ఆ సమయంలో మేమిద్దరం 22 ఏళ్ల ప్రాయంలో ఉన్నాం. మరొక్క ఏడాది ఆగి పెళ్లి చేద్దామని పెద్దలు అనుకున్నారు. ఆ ఏడాదిలో అంతా మారిపోయింది. ఆయన మరో వ్యక్తిని ఇష్టపడుతున్న సంగతి తెలిసి, నాతో ఆయన పెళ్లి జరగదని అర్థమయ్యాక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

అప్పుడు నాకు 22. అంతగా పరిపక్వత లేని వయస్సు. నేను చాలా బాధపడ్డాను. భార్య అయ్యే అర్హత నాలో లేదా అనుకున్నాను. అదే ఇప్పుడైతే ఆ వ్యక్తికి ఒక ‘టాటా’ చెప్పి వచ్చేస్తాను.

నేను బాధలో ఉన్న ఆ సమయంలో సహాయ దర్శకుడు జార్జ్ నా జీవితంలోకి వచ్చారు. ఆ సమయంలో నన్ను రక్షించే ఒక వ్యక్తి కావాలి. జార్జ్ కనిపించాడు. అతను ఆ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. నేనతణ్ని పెళ్లి చేసుకోవడం ఎవరికీ ఇష్టం లేదు. అయినా గుడ్డిగా అతణ్ని నమ్మి పెళ్లి చేసుకున్నాను. అది నాకు నేనై తీసుకున్న నిర్ణయం. కానీ ఆ బంధం నాకు ఏమీ ఇవ్వలేదు, బాధలు తప్ప. నా ఆస్తిపాస్తులు అక్కడే పోయాయి.

1980లో జార్జ్ నుంచి విడిపోయి బయటికి వచ్చాక నేను నడిరోడ్డు మీద ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితి. మా అమ్మ(ఎం.ఎల్.వసంతకుమారి) నన్ను తీ‌సుకుని లాయర్ దగ్గరికి వెళ్లింది. అప్పుడు నేను ఉండటానికి ఒక ఇల్లు కావాలి. డబ్బులెలా? ఆ సమయంలో దేవుడు నా వెంట ఉన్నాడు. వెంటనే AVM సంస్థ నుంచి డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత రోజు టి.రాజేందర్ గారి సినిమా షూటింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి నటించాను. అలా రెండు, మూడు రోజుల్లో నాకు కావాల్సిన డబ్బు వచ్చింది. ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను. మళ్లీ నా జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాను.

ఏ వ్యక్తినైతే వివాహం చేసుకోవాలని అనుకుని అది జరగకుండా పోయిందో, ఆ వ్యక్తి మీద నాకేమీ కోపం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అదే వ్యక్తి తన సొంత సినిమాలో నటించమని కోరినప్పుడు వెళ్లి ఆయనకే అమ్మగా నటించాను. అదొక Professionalism. ఇలాంటి క్షమించే గుణం నాకు ఎలా వచ్చింది అని ఎవరైనా అడిగితే, అది దైవానుగ్రహం అంటాను.

ఏదేమైనా నాకు పెళ్ళికి ముందు జీవితమే బాగుంది. నచ్చిన పాటలు, మెచ్చిన ఆటలు, సంగీతం, నాట్యం.. అంతా రంగుల లోకంలో ఉన్నట్టు ఉంది.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *